Election Nomination With Coins Officer Rejects : కాయిన్స్ వల్ల కష్టాలు.. ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ మిస్ - ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు 2023
Published : Oct 31, 2023, 8:21 PM IST
Election Nomination With Coins Officer Rejects :నామినేషన్ రుసుమును మొత్తం నాణేల రూపంలో ఇవ్వడాన్ని తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఈ చేదు అనుభవం ఎదురైంది. అఖిల భారత ట్రాన్స్‌పోర్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు గణేశ్ దాస్ మహంత్... కోర్బా స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించాడు. అందుకోసం తుల్సీ నగర్ బస్తీలోని ఎన్నికల కార్యాలయానికి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు. నామినేషన్ రుసుమైన 10 వేల రూపాయలను నాణేల రూపంలో సమర్పించారు. వాటిలో ఒక రూపాయి, రెండు, ఐదు రూపాయల నాణేలు ఉన్నాయి. వాటిని చూసిన అధికారి చిల్లరను తీసుకోవడానికి నిరాకరించారు. కేవలం 1000 రూపాయల వరకు మాత్రమే నాణేల రూపంలో తీసుకోవడానికి అనుమతి ఉందని అధికారులు అతడికి తెలిపారు. ఫలితంగా ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజున గణేశ్ దాస్ నామినేషన్ వేయలేక పోయారు. నాలుగు సంవత్సరాలుగా డ్రైవర్ యూనియన్ సభ్యులు ఇస్తున్న వాటిని భద్రపరచడం ద్వారా ఈ నాణేలు లభించినట్లు అతను చెప్పారు.