పరుగులు పెడుతున్న ప్రచారరథాల తయారీ - తెలంగాణ తాజా రాజకీయ వార్తలు
Published : Nov 9, 2023, 9:32 PM IST
Election Campaign Vehicles :తెలంగాణలో ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రాష్ట్రంలో నామినేషన్స్ దాఖలుకు.. రేపే చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో ప్రచారంలో జోరు పెంచారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే ఆశావహులు ప్రచారాన్ని ప్రారంభించారు. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు వాడవాడలా తిరుగుతూ.. ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ప్రజలకు దగ్గరకు వెళ్లడానికి ప్రతీ అభ్యర్థి ప్రత్యేకంగా వాహనాలు సిద్ధం చేయించుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచే రథాల తయారీ ప్రారంభమైనప్పటికీ.. నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం నుంచి తయారీ పనులు మరింత వేగవంతం అయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి తమ అవసరాలకు తగిట్లుగా వాహనాలను తయారు చేయించుకుని తీసుకెళ్తున్నారు. ఎన్నికలకు మరో 19 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. ప్రచారరథాల తయారీ ఊపందుకుంది. ఎక్కువ సంఖ్యలో శ్రామికులు పనిచేస్తూ.. వాహనాల తయారీ పనులను పూర్తి చేస్తున్నారు. పార్టీల మేనిఫెస్టో హామీలతో.. రంగురంగులుగా తీర్చిదిద్దుతున్నారు.