విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. న్యాయం చేయాలంటూ ఇఫ్లూలో ఆందోళనలు - లైగింక వేధింపులకు ఇఫ్లూలో విద్యార్థుల ధర్నా
Published : Nov 7, 2023, 2:18 PM IST
EFLU Students Hunger Strike Against Sexual Assault : హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇఫ్లూలో లైగింక వేధింపులకు గురైన విద్యార్థినికి న్యాయం చేయాలంటూ యూనివర్సిటీ గేట్ ముందు విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. గత నెల 18న తార్నాకలోని ఇఫ్లూలో పీజీ విద్యార్థినిపై ఇద్దరు ఆగంతకులు అత్యాచారయత్నం చేయబోయారు. దీనిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెలరోజులు కావస్తున్నా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారంటూ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళన చెేపట్టారు.
Rape Attempt on EFLU Student :లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి న్యాయం జరిగే వరకు నిరసన దీక్ష కొనసాగిస్తామంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు. నిందితులను వెంటనే అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అన్యాయంగా తమపై కేసులు నమోదు చేస్తున్నారని వెంటనే వాటిని ఎత్తివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వర్సిటీలో విద్యార్థులకు భద్రత కల్పిస్తున్నామని చెబుతున్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. కళాశాల యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఇప్పటి వరకు వీసీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.