Edupayala Temple Submerged : జల దిగ్బంధంలో.. ఏడుపాయల దేవస్థానం
Edupayala temple in Medak district : ఉపరితల ఆవర్తన ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో.. ఏడుపాయల ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఆలయం ముందు ఉన్న మంజీరా నది పాయ నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా గుడిలోకి వరద నీరు వచ్చి చేరింది. అర్చకులు ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. ఆలయ అర్చకులు పార్థివశర్మ వరద నీటిలో నుంచి గర్భ గుడిలోకి వెళ్లి అమ్మవారికి నిత్య పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం రాజగోపురం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కొనసాగిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా.. ఆలయం వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు స్పష్టం చేశారు.