ECE Allotment Common Binoculars Symbol to YSRTP : వైఎస్సార్టీపీకి బైనాక్యులర్స్ గుర్తు కేటాయింపు - వైఎస్సార్టీపీ ఎన్నికల గుర్తు బైనాక్యులర్స్
Published : Oct 26, 2023, 10:07 PM IST
ECE Allotment Common Binoculars Symbol to YSRTP : వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బైనాక్యులర్స్(YSRTP Election Symbol Binoculars) గుర్తును కేటాయించింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా తమకు ఉమ్మడి గుర్తు కేటాయించాలని వైఎస్సార్టీపీ ఈసీని కోరింది. రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పారా 10బీ కింద అనుమతిస్తూ ఆ పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ అభ్యర్థులకు బైనాక్యులర్స్ గుర్తును ఉమ్మడిగా కేటాయింపు చేసింది.
నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఆ పార్టీ అభ్యర్థులకు బైనాక్యులర్స్ గుర్తు కేటాయించాలని ఈసీ రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. అయితే ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో మాత్రం ఇతర అభ్యర్థులు ఎంచుకునేలా ఫ్రీసింబల్స్ జాబితాలో బైనాక్యులర్స్ గుర్తు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ పార్టీ కనీసం ఐదు శాతం స్థానాల్లో అభ్యర్థులను నిలపకపోతే ఉమ్మడి గుర్తు అందుబాటులో ఉండదని ఈసీ తెలిపింది. రాష్ట్రానికి సంబంధించి మరికొన్ని రిజిస్టర్డ్ పార్టీలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించింది. ఆజాద్ పార్టీకి సీసీటీవీ కెమెరా గుర్తును, విద్యార్థుల రాజకీయ పార్టీకీ బ్యాట్ గుర్తును, జన శంఖారావం పార్టీకి లేడీ ఫింగర్ గుర్తు కేటాయించింది.