Fire Accident At Karimnagar : ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం - karimnagar fire accident updates
Fire Accident At Karimnagar Industrial Area: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు తగ్గించేందుకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా రోజూ ఏదో ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్లోని పద్మానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న శ్రీ కల ప్లాస్టిక్ కంపెనీలో ఉదయం 7గంటలకు షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు 50 లక్షల విలువైన ఆస్తి దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
10 సంవత్సరాల కిందట మిషనరీ కొనుగోలు చేసి ప్లాస్టిక్ కంపెనీని కొనసాగిస్తున్నానని యజమాని వేణు తెలిపారు. జీవనాధారమైన ప్లాస్టిక్ కంపెనీ అగ్నికి ఆహుతి కావడంతో తీవ్ర ఆవేదన చెందారు. భారీగా ఆస్తి నష్టం జరగడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో తన కుటుంబం రోడ్డున పడే స్థితికి వచ్చిందంటూ వాపోయారు.