మద్యం తాగి కారు నడిపిన వ్యక్తి.. చెప్పుతో కొడుతూ మహిళ దేహశుద్ధి - వైరల్ వీడియోలు
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసింది ఓ మహిళ. మద్యం తాగి డ్రైవింగ్ చేసినందుకు చెప్పుతో కొట్టింది. మద్యం మత్తులో బైక్, ఆటోలను ఢీకొట్టినందుకు ఈ తరహాలో బుద్ధి చెప్పింది. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌పై మహిళ దాడి చేస్తున్న దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
గురువారం రాత్రి మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ వీరంగం సృష్టించాడు. ఓ బైక్‌ను రెండు ఆటోలను ఢీకొట్టాడు. దీంతో ఆటో బోల్తా పడింది. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ డ్రైవర్ వద్దకు వచ్చి.. ఎడాపెడా వాయించింది. చెప్పుతో సైతం కొట్టింది. విజయపుర సిటీలోని స్టేషన్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు గాను డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని అదుపులోకి కూడా తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.