త్వరలోనే ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు - ఇక నిమిషాల్లోనే పరీక్షల ఫలితాలు - Bibinagar AIIMS drone use
Published : Jan 5, 2024, 2:27 PM IST
Drone Services at Bibinagar AIIMS: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆధ్వర్యంలో డ్రోన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా పీహెచ్‌సీల నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రికి నిమిషాల్లో శాంపిల్స్‌ను చేరవేశారు. రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్ నిమిషాల్లోనే ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేసేందుకు డ్రోన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాట్లు చేస్తోంది. డ్రోన్స్ వివిధ ఔషధాలను త్వరితగతిన చేరవేసేందుకు కూడా ఉపయోగపడతాయని అధికారులు అంటున్నారు.
Drone Services At AIIMS Hyderabad : ప్రయోగాత్మకంగా కొండమడుగు, బొమ్మలరామారం, భువనగిరి మండలంలో బొల్లేపల్లి పీహెచ్‌సీలను బీబీనగర్ ఎయిమ్స్ ఎంపిక చేసింది. డ్రోన్ సేవలు తొలుత టీబీ రోగులకు అందించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా పీహెచ్సీలలో టీబీ ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల నుంచి సేకరించిన శాంపిల్స్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి, అక్కడ పరీక్షించిన అనంతరం ఫలితాలను పీహెచ్సీ వైద్యులకు పంపిస్తామని వెల్లడించింది. ఈ ప్రక్రియను కేవలం అరగంటలోనే పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో త్వరలో సేవలను ప్రారంభిస్తామని బీబీనగర్ ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. డ్రోన్ 25 కిలోల బరువును 34 కిలోమీటర్ల దూరం వరకు తీసుకు వెళ్లగలదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.