MLA Redya Naik Controversy : 'అలాంటి ఫిర్యాదులొస్తే.. ఆడవాళ్లతోనే తన్నిస్తా' - డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వైరల్ వీడియో
MLA Redya Naik Controversial Comments Viral : తన నియోజకవర్గంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. బాధ్యులైన అధికారులను ఆడవాళ్లతో తన్నిస్తానని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్లలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. డోర్నకల్ మండలంలో ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న తన 'పల్లె పల్లెకు రెడ్యానాయక్' కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పకీర తండాలో నీళ్లు రావడం లేదని చెబితే మరమ్మతులకు రూ.5 లక్షల ఇచ్చి 4 నెలలు అవుతున్నా.. నేటికీ పనులు పూర్తి చేయకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఇలా చేస్తే.. ప్రజలు తమకు ఓట్లు ఎలా వేస్తారంటూ రుసరుసలాడారు. ఈ క్రమంలోనే తన పర్యటన మొదలయ్యేలోపు పనులన్నీ చక్కబెట్టుకోవాలని.. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. బాధ్యులైన అధికారులను ఆడవాళ్లతోనే తన్నిస్తానని వ్యాఖ్యానించారు. సర్పంచులు అన్నింటిలో తమదే రాజ్యం అనుకోవద్దని.. ఎంపీటీసీ సభ్యులను కలుపుకొని పోవాలని సూచించారు. గ్రామాల పర్యటనలో పెద్ద ఎత్తున యువత, ప్రజలు పాల్గొనేలా చూసి.. కార్యక్రమాన్ని విజయవంతం చేసి తనను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు.