4నెలల క్రితం యజమాని మృతి- మార్చురీ ముందు పెంపుడు కుక్క ఎదురుచూపులు! - కన్నూర్ ఆసుపత్రి ముందు కుక్క నిరీక్షణ
Published : Nov 5, 2023, 11:07 AM IST
|Updated : Nov 5, 2023, 6:39 PM IST
Dog Waiting For Dead Owner : యజమాని మృతి చెందాడని తెలియని ఓ శునకం.. మార్చురీ ఎదుట అతడి కోసం నిరీక్షిస్తోంది. ఈ ఘటన కేరళలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. నాలుగు నెలలుగా యజమాని వస్తాడనే ఆశతో ఆస్పత్రి పరిసరాల్లోనే తిరుగుతోంది.
నాలుగు నెలల క్రితం ఓ వ్యక్తి అస్వస్థతకు గురై కన్నూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతడి పాటు పెంపుడు కుక్క కూడా వచ్చింది. అయితే ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బంది అతడి మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లారు. అది చూసిన కుక్క.. యజమాని వస్తాడని మార్చురీ ముందు ఎదురుచూస్తోంది. ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించారన్న విషయం తెలియక.. నాలుగు నెలలుగా అక్కడే ఉంటోంది. ఆస్పత్రి సిబ్బంది కుక్కను ఎన్నిసార్లు అక్కడ నుంచి పంపించడానికి ప్రయత్నించినా మళ్లీ వచ్చేస్తోంది.
యజమాని మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లడం చూసిన కుక్క.. ఇంకా అక్కడే ఉన్నాడని భావిస్తోందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అక్కడ నుంచి కుక్కను ఎంత పంపినా వెళ్లడం లేదని చెప్పారు.