DK Aruna Comments on PRLIS : 'పాలమూరు భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారు..?' - DK Aruna visited farmer Alloji family
Published : Sep 14, 2023, 4:46 PM IST
DK Aruna Comments on PRLIS :పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూ సేకరణలో భాగంగా భూమి కోల్పోయిన రైతు అల్లోజిది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ హత్యేనని, బాధిత కుటుంబానికి తక్షణమే రూ.50 లక్షల పరిహారం అందించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెరలో ఆత్మహత్యకు పాల్పడిన అల్లోజి మృతదేహానికి పూలమాలలు వేసి బాధిత కుటుంబాన్ని ఆమె ఓదార్చారు. అనంతరం బాధిత కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందజేశారు.
DK Aruna Comments on Palamuru Rangareddy Project :ఈ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులకు ఇంకా పరిహారమే అందలేదని.. ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని డీకే అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్క పంపు ప్రారంభించి.. ప్రాజెక్టు పూర్తైందని ఎలా చెప్తారని మండిపడ్డారు. ముందుగా భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సర్వే కోసం ఆదేశాలు ఇప్పించానని.. జూరాల వద్ద చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టును తన కుటుంబ స్వలాభం కోసం కేసీఆర్ నార్లాపూర్ వద్ద ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఆటలిక సాగవని హెచ్చరించారు. ప్రాజెక్టుల్లో కేసీఆర్ చేస్తున్న మోసాలను ప్రజలు గుర్తించారని.. బీఆర్‌ఎస్‌ను ఇంటికి సాగనంపేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు.