Devotees Rush in Yadadri : భక్త జనసంద్రమైన యాదాద్రి.. దర్శనానికి మూడు గంటల సమయం
Published : Oct 2, 2023, 7:05 PM IST
Devotees Rush in Yadadri : పంచనారసింహ క్షేత్రంగా విలసిల్లుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. దైవ దర్శనానికి వేచి ఉన్న భక్తులతో దర్శన వరుసల సముదాయాలు కిక్కిరిసిపోయాయి. దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. భక్తుల ఆరాధనలతో నిత్యకల్యాణం, అష్టోత్తరంతో మండపాలు నిండిపోయాయి. ప్రసాదాల కొనుగోలుకు వేచి ఉన్న భక్తులతో విక్రయ విభాగం చెంత గజిబిజి ఏర్పడింది. పట్టణ, ఆలయదారులన్నీ సందడిగా మారాయి. కొండపైన స్థలం సరిపోకపోవడంతో చాలా సమయం యాత్రికుల వాహనాలను ఘాట్ రోడ్డు ఆరంభం వద్ద నిలిపివేశారు.
కొండపై నీడ సౌకర్యాలు లేకపోవడంతో మండపాలు, ఆలయం వెలుపలకు వెళ్లే మార్గం, మెట్ల మార్గం, ప్రసాద విక్రయ కేంద్రం వద్ద భక్తులు కూర్చొని సేద తీరడం కనిపించింది. కొండపైకి కేవలం 18 నుంచి 20 ఉచిత బస్సులనే నడపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం నాడు స్వామివారిని 40 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని.. హుండీ ఆదాయం రూ.45 లక్షలు వచ్చినట్లు ఆలయ అధికార వర్గాలు తెలిపాయి