లైట్ల వెలుతురు లేనిది వాహనాన్ని పసిగట్టలేం - ప్రధాన రహదారులను కప్పేస్తున్న పొగమంచు - పొగమంచుతో ఇబ్బందులు
Published : Dec 30, 2023, 12:24 PM IST
Dense Fog In Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాలు పొగ మంచు వాహనదారులను, పట్టణవాసులను ఇబ్బందులు పెడుతుంది. కొన్ని రోజులగా కశ్మీర్‌ను తలపించేలా మంచు ప్రభావం కొనసాగుతోంది. భద్రాచలంలో కూడా మంచు తుపానులా పడుతోంది. జల్లులతో కూడిన మంచు కురవడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత వారం రోజుల నుంచి తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు మంచు పడుతూ చలి వాతావరణం నెలకొంటుంది. రామాలయ పరిసర ప్రాంతాలన్నీ మంచు తుపానులా కమ్మేసింది. రహదారులలో ఎదురుగా వచ్చే వాహనం కూడా పొగ మంచు వల్ల కనబడటం లేదు. ప్రయాణికులంతా వాహనాలకు లైట్లు వేసుకొని నెమ్మదిగా నడపాల్సిన పరిస్థితి నెలకొంది. తగ్గిన ఉష్ణోగ్రతల కారణంగా చిన్నారులు వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం కష్టంగా మారుతుంది.
ఇల్లందులోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఉదయం 11 గంటల వరకు కమ్ముకున్న మంచుతో వాహనదారులు లైట్లు వేయనిదే కదిలే పరిస్థితి నెలకొనడం లేదు. మాల ధారణ చేసిన అయ్యప్ప స్వాములకు చలికి తోడైన పొగమంచు మరో పరీక్షగా మారింది. గతంలో ఒకటి, రెండు రోజుల్లో తీవ్రంగా ఉండే పొగమంచు, వారం రోజులుగా కొనసాగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.