Medchal Traffic DCP Office Demolition : మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ నూతన కార్యాలయం కూల్చివేత.. కారణమిదే..! - మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్ కూల్చివేత
Demolition Of Medchal Traffic DCP Office : వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, పట్టణ ప్రణాళిక అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను గుర్తించి నేలమట్టం చేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌లో నూతనంగా నిర్మించిన ట్రాఫిక్ డీసీపీ కార్యాలయాన్ని పట్టణ ప్రణాళిక అధికారులు కూల్చివేశారు. గత నెలలో సైబరాబాద్ కమిషనర్ చేతుల మీదుగా ఈ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. నెల వ్యవధిలోనే కార్యాలయాన్ని కూల్చివేశారు.
ఈ విషయంపై మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీని ఫోన్లో వివరణ కోరగా.. సదరు స్ధలం హెచ్‌ఎండీఏ రోడ్డు కోసం వదలి పెట్టారని.. అప్పుడు ఆ విషయం తెలియక రేకుల షెడ్‌లో కార్యాలయం నిర్మించామని తెలిపారు. ఇప్పుడు రోడ్డు విషయం తెలిసి తామే కూల్చి వేసినట్లు ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. ఏదేమైనా ఇటీవల నిర్మించిన ఈ నూతన కార్యాలయాన్ని.. అప్పుడే కూల్చివేయడంతో సర్వాత్రా చర్చనీయాంశంగా మారింది.