Illegal Constructions Demolition : అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. 350 నిర్మాణాల కూల్చివేత - తెలంగాణ వార్తలు
Illegal Constructions Demolition : సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలో అక్రమ నిర్మాణాలను స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధికారులు పెద్ద ఎత్తున నేలమట్టం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రణ నిర్మాణాలకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు దాదాపు 150 మంది రెవెన్యూ సిబ్బంది, 200 మంది పోలీసుల బందోబస్తు మధ్య అక్రమంగా నిర్మించిన దాదాపు 350 నిర్మాణాలను కూల్చివేశారు. అయితే రెండు, మూడుచోట్ల చెదురు మదురు ఘటనలు జరిగినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. అధికారులు తమ ఇళ్లను అన్యాయంగా కూల్చి వేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తమ నివాసాలను కూల్చి వేస్తున్నారని కొంతమంది బాధితులు పోలీసులు, అధికారులపై తిరగబడ్డారు. ఒకానొక సమయంలో లాఠీ ఛార్జ్ చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో ఎవరికి వారు పరుగులు తీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.