తెలంగాణ

telangana

yamuna river danger mark

ETV Bharat / videos

ఉప్పొంగుతున్న యమునా నది.. సీఎం​, మంత్రుల ఆఫీసులు జలదిగ్బంధం

By

Published : Jul 13, 2023, 11:18 AM IST

Yamuna River Danger Mark : దేశ రాజధాని దిల్లీని యమునా నది వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలతో పాటు రాజ్‌ఘాట్‌ నుంచి దిల్లీ సచివాలయం వరకు ఉన్న ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, మంత్రుల కార్యాలయాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. రోడ్లు.. కాలువలను తలపిస్తున్నాయి. మోకాళ్లు లోతుకుపైగా వరదనీరు నిలిచిపోయింది. యమునా నదిలో నీటిలో ప్రవాహ ఉద్ధృతి 45 ఏళ్ల రికార్డును ఈసారి అధిగమించింది. ప్రస్తుతం యమునా నదిలో నీటి ప్రవాహం 208 మీటర్ల ఎత్తులో సాగుతోంది. దిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం 208 మీటర్లను దాటేసింది. గురువారం ఉదయం 8 గంటల వరకు 208.48 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నదీ ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇది తీవ్రమైన పరిస్థితి అని కేంద్ర జల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 45 పడవలతో 16,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది ప్రభుత్వం.

కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి
Kejriwal On Yamuna River : యమునా నదిలో నీటి ప్రవాహం గంటగంటకూ తీవ్రరూపం దాలుస్తుండటం వల్ల కేంద్రం జోక్యం చేసుకోవాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. హరియాణాలోని హత్నికుంద్‌ బ్యారేజ్‌ నుంచి తక్కువ మొత్తంలో నీటిని విడుదల చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను అభ్యర్థించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నది సమీపంలోని రోడ్లు వినియోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు కాపాడడం చాలా మఖ్యమని.. అందుకోసం ప్రజలు సహకరించాలని సీఎం కోరారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్​
కొన్నివారాల్లో దిల్లీలో జీ-20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుందన్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం కేజ్రీవాల్​. రాజధానిని వరద ముంచెత్తిందన్న సమాచారం ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలను పంపుతుందన్న కేజ్రీవాల్‌.. ఈ సంకట పరిస్థితుల నుంచి దిల్లీ ప్రజలను కలిసికట్టుగా కాపాడుకోవాల్సి ఉందని అమిత్‌ షాను కోరారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఈ నేపథ్యంలో దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా దిల్లీ విపత్తు నిర్వహణ బృందంతో గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details