Delhi High Court Notices to CM Jagan Couple: వాలంటీర్ల ద్వారా సాక్షి కొనుగోలు కేసు.. జగన్, భారతిలకు దిల్లీ హైకోర్టు నోటీసులు - జగన్ దంపతులకు దిల్లీ హైకోర్టు నోటీసులు
Delhi High Court Notices to CM Jagan Couple:గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దాఖలు చేసిన కేసులో దిల్లీ హైకోర్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డి, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు దిల్లీ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.
వార్తా పత్రిక కొనుగోలు కోసం రాష్ట్రంలోని వాలంటీర్లు, ఇతర ఉద్యోగులకు నెలకు రూ.200 కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దాఖలు చేసిన కేసుల విచారణను ఏపీ హైకోర్టు నుంచి దిల్లీ హైకోర్టుకు బదిలీచేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 17న ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు దేశ రాజధాని(దిల్లీ) హైకోర్టు కొత్తగా రిట్ పిటిషన్ 9096/2003 కింద నంబర్ కేటాయించింది.
సోమవారం దీనిపై విచారణ చేపట్టిన సీజే జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ సంజీవ్ నరులాలతో కూడిన ధర్మాసనం జగన్, భారతీరెడ్డి, ఏబీసీకి నోటీసులు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాలలోపు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వ శాఖలు, ఏపీ ప్రభుత్వం, జగతి పబ్లికేషన్స్, దాని అనుబంధ సంస్థ తరఫున న్యాయవాదులు హైకోర్టుకు హాజరయ్యారు.