వరదలో రిక్షా రైడ్.. ఛాతి లోతు నీటిలోనే ప్రయాణం - దిల్లీ వరద ప్రభావిత ప్రాంతాలు
Delhi flood video : దేశ రాజధాని దిల్లీలో ఓ కార్మికుడు ఛాతి లోతు వరద నీటిలో రిక్షా తొక్కుతూ కనిపించాడు. వరద ఉద్ధృతి కారణంగా ఎర్రకోట సమీపంలో వరద నీరంతా.. రోడ్డుపైనే నిలిచిపోయింది. ఆ వరద నీటిలోనే రిక్షా తొక్కడం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియోపై అనేక మంది కామెంట్లు చేస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా యమునా నది ఉగ్రరూపం దాల్చి.. దిల్లీని వరదల్లో ముంచెత్తింది. దీంతో రాజధాని నగర రోడ్లన్నీ జలమయం అయ్యి.. కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో.. పార్కింగ్‌లో ఉంచిన కార్లు, బైక్‌లు నీట మునిగాయి. వరద కారణంగా స్థానిక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ దిల్లీలో ఈ తీరు వరద ప్రవాహం 45 ఏళ్ల రికార్డును అధిగమించిందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు యమునా నది నీటి ప్రవాహం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. నదీ ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.