Deer Ran Into Police Station : వీధికుక్కలకు భయపడి పోలీస్ స్టేషన్లోకి జింక పిల్ల పరుగు.. తర్వాత ఏమైందంటే..
Published : Sep 28, 2023, 4:56 PM IST
Deer Ran Into Police Station :కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజగూడులో ఓ లేడి పిల్ల.. వీధికుక్కలకు భయపడి పోలీసు స్టేషన్లోకి పరుగులు తీసింది. శునకాల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ జింకకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన పోలీసులు జింకకు స్టేషన్లోనే ఫస్ట్ ఎయిడ్ చేశారు. అనంతరం అటవీ శాఖ అధికారుల సాయంతో జింకను దగ్గర్లోని పశువైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.
బారికేడ్ను దూకి మరీ..
బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నంజనగూడు పట్టణంలో ఏడాదిన్నర వయసున్న ఓ మగజింక పిల్ల తిరుగుతూ కనిపించింది. రోడ్డుపై ఉన్న జనాలు, వాహనాలను చూసిన జింక ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొన్ని వీధికుక్కలు ఆ లేడి కూనను వెంబడించాయి. దీంతో అది పరుగులు పెడుతూ నంజుండేశ్వరాలయం పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లోకి పరుగులు పెట్టింది. ఆ సమయంలో స్టేషన్ ఎదురుగా ఉన్న బారికేడ్ను దూకి మరీ కుక్కల దాడి నుంచి తప్పించుకుంది. ఇది గమనించిన పోలీసులు గాయపడిన జింకకు ప్రథమ చికిత్స అందించారు. అయితే ఈ ఘటనలో జింకకు మూడు, నాలుగు చోట్ల స్వల్ప గాయాలయ్యాయని వారు తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ అనంతరం దానిని అటవీ శాఖ అధికారుల సాయంతో దగ్గర్లోని పశువైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. మరో వారం రోజులపాటు లేడి పిల్లకు ప్రత్యేక పశువైద్యాధికారి పర్యవేక్షణలో చికిత్స చేయనున్నారు.