14,000 అడుగుల విస్తీర్ణంలో హనుమాన్, మోదీ చిత్రాలు-వినూత్నంగా దీపావళి వేడుకలు - దివాళీ లేలెస్ట్ న్యూస్
Published : Nov 12, 2023, 10:33 AM IST
Deepavali 2023 Celebration : దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు బారులు తీరగా.. మరికొందరు వినూత్నంగా దీపావళి వేడుకలను నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన శికా శర్మ అనే కళాకారిణి వినూత్నంగా దీపావళిని చేపట్టారు. హనుమంతుడి చిత్రంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్థానిక బీజేపీ నేత కైలాశ్ విజయ వర్గీయ ప్రతిమలను గీశారు. దీంతో పాటుగా ఇందౌర్ అభివృద్ధిని ప్రతిబింబించేలా కూడా చిత్రాలు వేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోనూ రంగోళి కార్నివాల్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాముడు, హనుమంతుడు చిత్రాలతో పాటు వివిధ దేశాల జెండాలను ఔత్సాహికులు గీశారు.
రాముడి సైకత శిల్పం
మరోవైపు దీపావళి పండగను పురస్కరించుకుని ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకతో శ్రీరాముడి చిత్రంతో పాటు, దీపాన్ని రూపొందించారు. అందులో దీపావళి శుభాకాంక్షలు అని రాశారు. ఈ సైకత శిల్పం చూపరులను కట్టిపడేస్తోంది.