పింఛన్ నిలిపివేతపై వాగ్వాదం - బీపీ పెరిగి వృద్ధుడు మృతి, శవంతోనే వేలిముద్రలు తీసుకున్న సిబ్బంది - chittor pension news
Published : Jan 5, 2024, 4:45 PM IST
|Updated : Jan 5, 2024, 4:56 PM IST
Death of Old Man to Stop Pension : అర్హతలున్నా అధికార పార్టీకి విధేయత పింఛన్‌దారుల పాలిట శాపంలా మారింది. ప్రతిపక్షాల మద్దతు దారులని తెలిస్తే ఇక అంతే!. ఓటరు జాబితాలోనూ పేరు గల్లంతే. ఇక చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఓ దారుణం చోటుచేసుకుంది. అధికారుల వివక్షకు ఓ నిండు ప్రాణం బలైంది. అధికార పార్టీ నేత కానుకను తిరస్కరించినందుకు ఓ వృద్ధుడి ప్రాణాలను బలితీసుకున్నారు.
అధికార పార్టీ నేత కానుకను తిరస్కరించినందుకేనా! :చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం సోగడబల్ల గ్రామానికి చెందిన సర్దార్ అనే వృద్ధుడికి అధికారులు పింఛన్ నిలిపేశారు. ఈ క్రమంలో తనకు పింఛన్ ఎందుకు ఇవ్వలేదని తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్లిన సర్దార్ సిబ్బంది నిలదీశారు. తనకు జరిగిన అన్యాయంపై అధికారులను ప్రశ్నిస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో సచివాలయ సిబ్బంది 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే సర్దార్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
Chittoor District : తన తండ్రి మృతికి అధికార పార్టీ నాయకులే కారణమంటూ సర్దార్ కుమారుడు ఆరోపించారు. అధికారులు రెచ్చగొట్టడం వల్లే బీపీ పెరిగి కన్నుమూశాడని కన్నీరుమున్నీరయ్యాడు. సమయానికి పింఛన్ ఇచ్చి ఉంటే బతికేవాడంటూ రోదించడం నాయకులను కంటతడి పెట్టించింది. రెండు రోజుల క్రితం వైసీపీ ముఖ్యనేత పార్టీ తరఫున పంచిన చీరను తన తండ్రి తిరస్కరించినందుకే పింఛను నిలిపివేశారని సర్దార్ కుమారుడు వాపోయారు. తండ్రి మరణానంతరం వేలిముద్ర తీసుకుని సచివాలయ సిబ్బంది పింఛను ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. సకాలంలో తన తండ్రికి పింఛను ఇచ్చి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేదికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.