టికెట్ రాని నేతలు చాలా అదృష్టవంతులు: దగ్గుబాటి
Published : Jan 10, 2024, 3:59 PM IST
Daggubati Venkateswara Rao key comments: ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ రాని నేతలు అదృష్టవంతులని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రులో రుద్రభూమి మహాప్రస్థానం (హిందూ శ్మశానవాటిక) ప్రారంభోత్సవంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కామినేని శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. శ్రీ చెన్నకేశవ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు కోటి రూపాయల నిధులతో నిర్మించారు. శ్మశానవాటిక నిర్మాణానికి సహకరించిన ప్రవాసాంధ్రులను మాజీమంత్రులు దగ్గుబాటి, కామినేని శ్రీనివాసులు అభినందించారు.
ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేయటం, మళ్లీ సంపాదించడం కోసమేనని వెంకటేశ్వరరావు ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యేలు కొంత సంపాదించుకున్నా, ప్రస్తుతం మాత్రం పార్టీ అధినేతలే సంపాదించుకునే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారారని ఎద్దేవా చేశారు. ఇసుక, మద్యం, మైనింగ్‌లో పార్టీలో పెద్దలు దొచుకోవడానికే సరిపోతుందని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేవారని, నేడు అవకాశం లేకుండా పోయిందని వెంకటేశ్వరరావు విమర్మించారు. ప్రజాప్రతినిదిగా ఎందుకు గెలిచానా అనే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. తన ఉద్దేశం ప్రకారం ఎవరికైతే టికెట్ రాదో వాళ్లు అదృష్టవంతులని పేర్కొన్నారు. కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా, సంపదంతా ఒకచోటకే వెళ్తుందని పేర్కొన్నారు. ఒడిపోయినోడు అక్కడే ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికెళ్లి ఏడుస్తాడని ఎద్దేవా చేశారు. తాను ఎవరినో దూషించటానికో, కక్షతో చెప్పే మాటలు కాదని, ప్రస్తుత పరిస్థితి అలా ఉందని తెలిపారు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నట్లు దగ్గుబాటి తెలిపారు.