ఊడిపోయిన సాగర్ ఎస్కేప్ గేట్ - వందల ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు - పుట్టెడు దుఃఖంలో అన్నదాతలు
Published : Nov 20, 2023, 11:57 AM IST
|Updated : Nov 20, 2023, 12:07 PM IST
Crop Fields Submerged in Suryapet District : ఆరుగాలం పండించిన పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడుతుంటారు. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు వాతావరణ పరిస్థితులు రైతులకు ఎప్పుడూ పరీక్ష పెడుతూనే ఉంటాయి ఉంటాయి. అయినా వారు వెనుకడుగు వేయకుండా.. నేల తల్లినే నమ్ముకొని సేద్యం చేస్తూనే ఉంటారు. పంట కోతకు రాగానే వారు పడిన శ్రమనంతా మర్చిపోతారు. కానీ అదే సమయంలో పంట నీటమునిగితే వారి కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది.
తాజాగా సూర్యాపేట జిల్లాలో ఆరుగాలం పండించిన పంట నీటిపాలైంది. మునగాల సమీపంలో సాగర్ ఎడమ కాలువ (Sagar Left Canal) ఎస్కేప్ గేటు ఊడిపోవడంతో.. కోతకు వచ్చిన పంట పొలాలు నీట మునిగాయి. పోలేనిగూడెం, బేతవోలు, తదితర గ్రామాలలో సుమారు 1000 ఎకరాల్లోకి సాగర్ నీరు చేరి వరిపైరు మునిగిపోయింది. రెగ్యులేటింగ్ గేట్ తుప్పు పట్టి ప్రమాదకర స్థితిలో ఉందని .. అయినా ఖమ్మంలోని పాలేరు చెరువు నింపేందుకు ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారని రైతులు ఆరోపించారు. అందువల్లే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. మునిగిన పొలాలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. అప్రమత్తమైన అధికారులు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు.