CPI Praja Garjana Sabha At Kothagudem : 'బీజేపీని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టులకే ఉంది' - CPI Narayana
CPI Praja Garjana Sabha : ఎన్ని బెదిరింపులకు పాల్పడినా.. ఎన్ని పర్యటనలు చేసినా వామపక్ష ఉద్యమాలకు పెట్టని కోటలాంటి తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని సీపీఐ జాతీయ నేత నారాయణ పేర్కొన్నారు. ఓట్ల పరంగా తమకు బలం తక్కువున్నా.. బీజేపీని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభ సందర్భంగా కొత్తగూడెం ఎరుపెక్కింది. వివిధ ప్రాంతాల కమ్యూనిస్టు శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. దేశంలో మతం పేరుతో విచ్ఛిన్నశక్తిగా మారిన బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని ఈ సందర్భంగా నారాయణ పిలుపునిచ్చారు.
కమ్యూనిస్టులు అమ్ముడుపోయారన్న బండి సంజయ్ ఆరోపణలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. బీజేపీ ఎందులోనూ కమ్యూనిస్టులకు సాటిరాదన్న ఆయన.. ప్రపంచంలో ఎక్కడా ఎర్ర జెండా లేకుండా హక్కులు సాధించుకున్న చరిత్ర లేదన్నారు. నమ్మిన సిద్ధాంతాలను వదలని తమకు బీజేపీ నేతలు నీతులు చెబుతారా అంటూ మండిపడ్డారు. ఆ పార్టీ నేతల మాదిరిగా అధికారం కోసం అడ్డమైన గడ్డి తినడం లేదని విమర్శలు గుప్పించారు. మనుషుల మధ్య విభజన తీసుకువచ్చే సిద్ధాంతాలు బీజేపీవని.. ప్రజల కోసం కమ్యూనిస్టులు ప్రాణాలు త్యాగం చేశారని చెప్పుకొచ్చారు.