CPI Narayana Fires on BJP : కేసీఆర్ కుటుంబ సభ్యులను మీరే కాపాడుతూ.. మళ్లీ విమర్శలెందుకు : సీపీఐ నారాయణ - CPI Narayana on Adani issue
Published : Oct 11, 2023, 1:38 PM IST
CPI Narayana Fires on BJP :కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో మంగళవారం బీజీపీ నిర్వహించిన జనగర్జనలో అమిత్షా మాట్లాడిన మాటలపై తాజాగా నారాయణ స్పందించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతూ.. విమర్శలు ఎందుకు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుటుంబ సభ్యులను బీజేపీ కాపాడుతూ.. మరోవైపు విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. అసలు వాళ్లను కాపాడేది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆప్ నేతలను అరెస్ట్ చేసి.. మిగిలిన నేతలను కాపాడుతున్నారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజీ ఒప్పందం కుదిరాకే వైసీపీ, కేసీఆర్, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారన్నారు. అందుకే మనీశ్ సిసోడియాను జైల్లో పెట్టారని నారాయణ పేర్కొన్నారు.
అందరూ కలిసి కుమ్మక్కై సిసోడియను మాత్రమే ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో మీరు భాగస్వాములు కాదా.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దొంగల్ని మీరే కాపాడుతున్నారన్నారు. సత్యం రామలింగరాజు మీద సెబీ దర్యాప్తు వేశారని.. అదాని కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వైరీ చేయలేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారని దుయ్యబట్టారు. నిరాశ నిస్పృహలో ఉన్నవారు, ఓటమికి దగ్గరవుతున్న వారు ఇలాంటి అబద్ధాలు, అనైతిక మాటలు మాట్లాడటం చేస్తారని నారాయణ విమర్శించారు. దేశానికి ఇది మంచిది కాదని హితవు పలికారు.