మంచిర్యాలలో కాంగ్రెస్ కార్యకర్తపై బీఆర్ఎస్ కౌన్సిలర్ దాడి - కాంగ్రెస్ కార్యకర్తపై రమేశ్ దాడి న్యూస్
Published : Dec 3, 2023, 10:41 AM IST
Councilor Attack On Congress Worker In Mancherial : మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక 16వ వార్డు కౌన్సిలర్ రమేశ్ తమ కార్యకర్తను అకారణంగా కొట్టారని ఆరోపిస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెన్నూరు పట్టణంలో ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ స్థానిక గాంధీచౌక్ వద్ద రోడ్డుకు అడ్డంగా బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు నిరసనకారుల వద్దకు చేరుకొని ఎదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండని నాయకులకు నచ్చజెప్పడంతో శాంతించిన వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
కొత్తగూడెం కాలనీకి చెందిన బొంతల సందీప్ అనే యువకుడు తన వీధిలో జేసీబీ తగిలి విద్యుత్తు తీగ తెగిపడింది. రాత్రి అవుతున్నందున తీగను సరిచేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని కౌన్సిలర్ రమేశ్‌ను కోరగా, ఆయన ఆగ్రహంతో అతడిపై విచక్షణా రహితంగా కర్రతో దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వీధిలో అందరూ చూస్తుండగానే నిన్ను చంపేస్తానంటూ సందీప్‌పై బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. తీవ్రంగా గాయపడ్డ బాధితుణ్ణి ప్రథమచికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఓ ప్రజాప్రతినిదై ఉండి సమస్యను పరిష్కరించకపోగా తమ పార్టీ కార్యకర్త అన్న అక్కసుతో దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రమేశ్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.