Corn crop fire accident: ఆరుగాలం శ్రమ అగ్గిపాలు.. అన్నదాత దిగాలు - Bhadradri
Corn crop fire accident: ఆరుగాలం కష్టపడి.. చీడ పీడల బారి నుంచి తన పంటను కాపాడుకుంటూ వచ్చాడు ఆ రైతు. ఎదిగిన మొక్కజొన్న పంటను చూసి మురిసిపోయాడు. పొలం మధ్యలో రాశిగా వేసిన కంకులు చూసి.. అవి అమ్మగా వచ్చిన డబ్బులతో బ్యాంక్లో ఉన్న బంగారు అభరణాలను తీసుకొని.. మిగతా డబ్బులతో అప్పులు తీర్చుదామని తెగ సంబుర పడిపోయాడు. కానీ.. ఆ అన్నదాత ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి. పొలంలో కుప్పగా ఉంచిన నాలుగు ఎకరాల పంట కాస్తా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
ఇల్లందు మండలం లక్ష్మీనారాయణ తండాలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట బూడిదైంది. తండాలోని బానోత్ పాప్యా అనే రైతు తన పొలంలో పండిన మొక్కజొన్న కంకులను కుప్పగా ఉంచాడు. మిట్ట మధ్యాహ్నం సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో మంటలు పొలాన్ని చుట్టుముట్టాయి. దీంతో పంట మొత్తం అగ్నికి ఆహుతైంది. పక్క పొలంలోకి మంటలు వ్యాపించడంతో మరో రెండు ఎకరాల పంట కూడా నాశనమైంది. అధిక మొత్తంలో డబ్బులు అప్పు చేసి మరీ పంటపై పెట్టుబడిగా పెట్టామని.. తీరా పంట చేతికి వచ్చిన సమయంలో ఇలా అగ్గిపాలైందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు.