Kaleswaram Project : కాళేశ్వరం నుంచి కొనసాగుతున్న ఎత్తిపోతలు - Kaleshwaram project latest news
Continued Water Lifting in Kaleswaram :కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ.. క్రమంగా మోటార్లను పెంచుతూ అధికారులు నీటిని ఎత్తిపోస్తున్నారు. పెద్దపల్లి జిల్లా నంది మేడారం పంప్‌హౌస్ నుంచి ఏకంగా ఐదు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఐదు మోటార్ల ద్వారా 15,750 క్యూసెక్కుల నీటిని.. నందిమేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. లింకు-1లోని లక్ష్మీ పంప్‌హౌస్‌లో ఐదు.. సర్వసతి పంప్‌హౌస్‌లో నాలుగు.. పార్వతి పంప్‌హౌస్‌లో నాలుగు మోటార్ల చొప్పున నడిపిస్తున్నారు.
ఇక్కడ ఎత్తిపోసిన నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్ వద్ద.. నాలుగు బాహుబలి మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎగువకు తరలిస్తున్నారు. శ్రీరాములపల్లి జంక్షన్ నుంచి ఎగువ ప్రాంతాలైన రాంపూర్, రాజేశ్వరరావు పేట, ముప్కాల్ పంప్ హౌస్‌ల మీదుగా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు చేరుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఎగువ ప్రాంతాల నుంచి 13,146 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు కాళేశ్వరం నుంచి 4350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా.. గాయత్రి పంప్‌హౌస్ నుంచి మధ్య మానేరులోకి మరో 2,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.