Constable Rescues a Passenger : రైలు ఎక్కబోతూ జారిపడిన ప్రయాణికుడు.. కాపాడిన కానిస్టేబుల్ - ప్రయాణికుడిని కాపాడిన రైల్వే కానిస్టేబుల్
Constable Rescues a Passenger in Gadwal district: రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడిన ఓ ప్రయాణికుడిని రైల్వే కానిస్టేబుల్ కాపాడారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల రైల్వే స్టేషన్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి సికింద్రాబాద్ నుంచి కర్నూల్ వెళుతున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ గద్వాల రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతున్న క్రమంలో గద్వాల పట్టణానికి చెందిన షరీఫ్ ట్రైన్ ఎక్కే క్రమంలో కిందకు జారిపడ్డాడు.
షరీఫ్ ప్రమాదవశాత్తు జారి రైలు కింద పడుతున్న సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న రైల్వే కానిస్టేబుల్ నాగరాజు అప్రమత్తమయ్యారు. వెంటనే షరీఫ్‌ను పక్కకు లాగడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. షరీఫ్ ప్రాణాలు కాపాడిన రైల్వే కానిస్టేబుల్ నాగరాజును ఉన్నతాధికారులు అధికారులు, ప్రయాణికులు అభినందించారు.
రైలు ప్రయాణం చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు రైల్వే అధికారులు సూచించారు. రైలు ఎక్కినప్పుడు సమయపాలన పాటించాలని తెలిపారు. రైలు కదులుతున్న సమయంలో ట్రైన్‌కు దూరంగా ఉండాలని, రైలు ఆగిన తర్వాతే ఎక్కాలని ప్రయాణికులకు సూచించారు.