పోలింగ్‌కు ముందు కోడిబొమ్మ చీటీలు - చికెన్ సెంటర్ల వద్దకు వెళ్లిన ఓటర్లకు షాక్
Published : Dec 1, 2023, 9:44 AM IST
|Updated : Dec 1, 2023, 9:53 AM IST
Congress Offered Chicken To Voters Telangana 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ప్రశాంతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగింది. నాయకులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఓటర్లకు నగదుతో పాటు చికెన్, మటన్ పంపిణీ చేశారు. నల్లగొండ జిల్లా, మిర్యాలగూడలో రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చిన తాయిలాలతో మాంసం ప్రియులకు పసందైన విందు అంది అందకుండా దోబూచులాడింది. ప్రత్యర్థి పార్టీలకు దీటుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా ప్రజలకు చికెన్ పంపాలనే ఉద్దేశంతో కోడి బొమ్మ చిట్టీలను పంచింది.
ఎన్నికల సమయంలో అధికారులు చికెన్ సెంటర్లను మూయించారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత వెంటనే చికెన్ సెంటర్లకు కోడిబొమ్మ చీటీలతో వందల మంది బారులు తీరారు. ఒక్క సారిగా వందల మంది చికెన్ సెంటర్లకు రావడంతో అందరికీ ఇవ్వలేక చికెన్ షాప్ యజమానులు చేతులు ఎత్తేశారు. దీంతో మిర్యాలగూడ ప్రజలు రాజకీయ నాయకుల ఎత్తులను చూసి ముక్కున వేలేసుకున్నారు.