Congress Leader Subhash Reddy Crying Viral Video : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సుభాశ్‌రెడ్డి.. కంటతడి - తెలంగాణ కాంగ్రెస్
Published : Oct 28, 2023, 4:07 PM IST
|Updated : Oct 28, 2023, 4:29 PM IST
Congress Leader Subhash Reddy Crying Viral Video : కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభ్యర్థుల రెండో జాబితా వెలువడటంతో టికెట్ ఆశించిన నేతలు కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ మదన్‌మోహన్‌రావుకు కేటాయించింది. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సుభాశ్‌రెడ్డి.. తనకు టికెట్ రాకపోవటంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎల్లారెడ్డిలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ఆయన.. తన అనుచరులను చూసి ఒక్కసారిగా బోరుమని విలపించారు.
Congress Leader Crying :ఎల్లారెడ్డి టికెట్ తనకే వస్తుందని కొన్నేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న సుభాశ్‌రెడ్డి.. టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా టికెట్ మరొకరికి రావటంతో కార్యకర్తలను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబాన్ని, బంధువులను సైతం పక్కనబెట్టి పార్టీ కోసం తిరిగానని, ఇక తనను కార్యకర్తలే కాపాడుకోవాలంటూ కన్నీరుపెట్టుకున్నారు. తమ నాయకుడు ఆవేదనను చూసి కార్యకర్తలు సైతం విలపించారు.
అనంతరం వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని.. ఎల్లారెడ్డిలో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగుతానని సుభాశ్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌ను గెలవనివ్వనని సవాల్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతానని.. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. గత ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని సుభాశ్‌రెడ్డి స్పష్టం చేశారు.