మద్దతు ఇచ్చిన పార్టీల సూచనలు, సలహాలతోనే ముందుకెళ్తాం : మల్లు రవి - టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిసిన రేవంత్
Published : Dec 5, 2023, 7:07 PM IST
Congress Leader Mallu Ravi Meet Professor Kodandaram : రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ తమకు రావడంలో తమవంతు పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ధన్యవాదాలు తెలిపారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఆయన ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు. అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించారు. టీజేఎస్‌తో పాటు వామపక్ష పార్టీల మద్దతు ఎన్నికల్లో చాలా ఉపయోగపడిందన్నారు. రాష్ట్రంలో ప్రజాసామ్య పునరుద్ధరణకు కాంగ్రెస్‌పార్టీ కట్టుబడి ఉంటుందని మల్లు రవి స్పష్టం చేశారు.
ఒక అజెండాతోనే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చామని అది తీర్చే దిశగా అడుగులేయాలని కాంగ్రెస్‌ను కోరనున్నట్లు మరోసారి కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణలో నిరంకుశపాలన పోగొట్టడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయని తెలిపారు. సీఎం ప్రమాణస్వీకారం అనంతరం మద్దతు ఇచ్చిన పార్టీలతో సమావేశం అవుతారని తెలియజేశారు. వారి సూచనలు, సలహాలతో ముందుకెళ్తామని వెల్లడించారు. ఇప్పటికే మద్దతు ప్రకటించిన ప్రతిఒక్కరికి ఫోన్ చేసి మాట్లాడామని మల్లు రవి తెలిపారు.