ఆ 94 ఎకరాలను ప్రభుత్వం తిరిగి తీసుకోవాలి : వీహెచ్ - assigned lands hyderabad
Published : Dec 30, 2023, 9:09 PM IST
Cong Leader Hanmantharao on Assigned Lands : హైదరాబాద్ నగర శివారు ప్రాంతం కీసరలో ధరణిని అడ్డుపెట్టుకుని పెద్దలు లాక్కున్న ఇందిరా గాంధీ ఎస్సీలకు ఇచ్చిన 94 ఎకరాలను తిరిగి తీసుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు తెలిపారు. గత ప్రభుత్వం ధరణి పేరు మీద ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను లాక్కుందని ఆరోపించారు.
భూములు లాక్కున్న వారేమో ఒక్కో విల్లా రెండున్నర కోట్లకు అమ్ముతున్నారని, భూములు కోల్పోయిన వాళ్లు మాత్రం అడుక్కు తింటున్నారని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి ధనవంతులకు ఉపయోగపడేదని పేర్కొన్నారు. దాదాపు రూ.500 కోట్ల విలువైన పేదల భూమిని పెద్దలు లాక్కున్నారన్న ఆయన, పొంగులేటికి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. మంత్రి పొంగులేటి వెంటనే రెవెన్యూ కార్యదర్శిని పిలిచి ఆరా తీశారన్నారు. సదరు భూములను తిరిగి పేదలకు ఇప్పించినప్పుడే బడుగు బలహీన వర్గాల పార్టీగా కాంగ్రెస్‌కు పేరొస్తుందన్నారు. ఖమ్మం సభలో ఈ భూములకు సంబంధించి రాహుల్ గాంధీ తనకు హామీ కూడా ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.