పన్ను కట్టలేదని కమిషనర్ తాళం వేయించాడు - ఛైర్మన్ వచ్చి తీయించాడు - Tax issue in Nirmal
Published : Jan 8, 2024, 4:12 PM IST
Conflict Between Municipal Chairman and Municipal Officers in Nirmal : ఆస్తిపన్ను విషయంలో నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ వ్యవహరించిన తీరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పట్టణ మున్సిపాలిటీకి ఆదాయం పెంచాల్సింది పోయి, పన్నులు కట్టని కొందరు పెద్దల పట్ల దయతో వ్యవహరించడం, ఇందుకోసం ఏకంగా కలెక్టర్ ఆదేశాలనే పక్కనే పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే గత రెండు సంవత్సరాలుగా నిర్మల్‌లోని లయన్స్ క్లబ్ దుకాణ సముదాయం మున్సిపాలిటీకి రూ.12 లక్షల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు ఆస్తి పన్ను చెల్లించాలని ఆఫీసర్స్ క్లబ్ వారికి పలుమార్లు నోటీసులు పంపింది. అయితే ఈ నోటీసులను క్లబ్ సభ్యులు బేఖాతరు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ శాఖతో కలిసి దుకాణాలకు తాళాలు వేశారు.
Nirmal Municipal Chairman Argue with Employees: దుకాణాలకు తాళాలు వేస్తున్న విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్మన్(Municipal Chairman) ఈశ్వర్, క్లబ్ అధ్యక్షుడు రాజేందర్ దుకాణ సముదాయం వద్దకు చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పన్ను చెల్లించేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ ఛైర్మన్ అధికారులతో మాటల యుద్దానికి దిగారు. అనంతరం షాపులకు వేసిన తాళాలను తీయించారు. ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఈ సమస్యను పై అధికారులకు చేరవేసిన తరవాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.