'రంజితమే' పాటకు అదరగొట్టిన జిల్లా కలెక్టర్.. వీడియో చూశారా? - కలెక్టర్ డ్యాన్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. దేశవ్యాప్తంగా మహిళలు సన్మానాలతో సంబరాలు అంబరాన్నంటాయి. వేదికలన్నీ మహిళా శక్తిని చాటుతూ మారుమోగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు మహిళా దినోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తమిళనాడుకు చెందిన ఓ కలెక్టర్.. అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో పాల్గొని డ్యాన్స్ చేశారు. పుదుకొట్టై జిల్లాలో కలెక్టర్ కవితా రాము ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ మహిళా ఉద్యోగినిలు హాజరయ్యారు. ఈ వేడుకలకు హాజరైన మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికి పంచారు. ఆ తర్వాత మహిళా ఉద్యోగులతో పాటు పురుషులు కూడా డ్యాన్స్ చేశారు. అనంతరం కలెక్టర్ కూడా డ్యాన్స్ చేయాలని కోరగా.. ఇటీవలే దళపతి విజయ్ హీరోగా నటించిన 'వారసుడు' సినిమాలోని 'రంజితమే' అనే పాటకు కలెక్టర్ కవితా రాము స్టెప్పులేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.