Coins Pandal In Assam : రూ.11 లక్షల విలువైన నాణేలతో దుర్గా మండపం.. అందుకోసమేనట.. - అసోంలో బంగారు వెండి నాణేలతో పూజా మండపం
Published : Oct 20, 2023, 10:29 AM IST
Coins Pandal In Assam : దేశంలో నలుమూలలా దుర్గా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. అయితే అసోంలోని నాంగావ్లో జిల్లాలో ఉన్న దుర్గా మండపాన్ని రూ. 11 లక్షల విలువైన నాణేలతో వినూత్నంగా ఏర్పాటు చేశారు అక్కడి నిర్వాహకులు. ప్రస్తుతం ఈ దుర్గా మండపం అందరి దృష్టినీ అకర్షిస్తోంది. రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల కాయిన్లను ఉపయోగించి మండపాన్ని అలంకరించారు.
పూజా మండపం అలంకరణ కోసం బ్యాంకు నుంచి రూ.10 లక్షల విలువైన నాణేలు, భక్తుల నుంచి విరాళాలుగా మరి కొంత మొత్తాన్ని నిర్వాహకులు సేకరించారు. వీటిని ఒక క్రమ పద్దతిలో అమర్చారు. మండపం పై భాగంలో బంగారు, వెండి నాణేలను అమర్చారు. ఈ క్రమంలో పసిడి కాంతులతో దుర్గా మండపం భక్తులందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. భక్తులను, ప్రజలను ఆకట్టుకునే ఉద్దేశంతోనే ఈ విధంగా వినూత్నంగా దుర్గా మండపాన్ని ఏర్పాటు చేసినట్లుగా శని మందిర్ దుర్గా పూజా కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ మండపానికి కాయిన్స్ టెంపుల్‌గా నామకరణం చేశామని అన్నారు.