హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి - రజినీ ఉద్యోగ దస్త్రంపై రెండో సంతకం - బోయిగూడ కమాన్ రజినీకి ఉద్యోగం
Published : Dec 7, 2023, 7:43 PM IST
CM Revanth Second Sign on Rajini Job Appointment :సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగురాలు రజినీ ఉద్యోగ దస్త్రంపై రెండో సంతకం చేసి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి సంతకం ఆరు గ్యారెంటీల అమలుపై చేయగా, రెండో సంతకం దివ్యాంగురాలైన రజినీ ఉద్యోగ నియామక దస్త్రంపై చేశారు.
CM Revanth Swearing Ceremony :ఎల్బీస్టేడియంలో రేవంత్ ప్రమాణ స్వీకారానికి నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజినీకి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. గత అక్టోబరు నెలలో ఆరు గ్యారెంటీలపై ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డిని గాంధీభవన్‌లో దివ్యాంగ మహిళ రజినీ కలిశారు. తాను పీజీ చదివినా ఏ ప్రైవేట్ కంపెనీలోనూ ఉద్యోగం ఇవ్వడం లేదని ఆవేదన వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీకి ఉద్యోగం ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇది రేవంత్ గ్యారెంటీ అంటూ అనంతరం ఆయనే స్వయంగా ఆరు గ్యారెంటీ కార్డులో ఆమె పూర్తి వివరాలను అడిగి నమోదు చేశారు. ప్రమాణ స్వీకారం రోజు అభయ హస్తం స్లిప్ తీసుకొని రావాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం తన రెండో సంతకం రజినీ ఉద్యోగ దస్త్రంపై చేశారు.