యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి - ఉత్తమ్ కుమార్‌తో మీటింగ్ నిర్వహించిన రేవంత్
Published : Dec 17, 2023, 10:32 PM IST
CM Revanth Reddy Review Meeting on Irrigation Department : యాసంగి పంటకు నీటి విడుదల, కుంగిన మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ఈ మేరకు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల రంగం ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Uttam Kumar Review Meeting Today : బీఆర్ఎస్ సర్కారు అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కారు అందుకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందు సిద్ధమైంది. ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project) పియర్స్ కుంగిపోవడం సహా ఇతర అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు. కాళేశ్వరం అవకతవకలపై విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదంటూ గుత్తేదారు సంస్థ ఎల్‌అండ్‌టీ ఇచ్చిన లేఖపైనా సమావేశంలో చర్చించారు. త్వరలోనే మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలిస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.