'పదేళ్లు పడిన కష్టానికి తెలంగాణ అన్నింటా నంబర్ వన్ - ఇప్పుడు వేరేవాళ్లు వస్తే అదంతా బూడిదలో పోసిన పన్నీరే' - బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
Published : Nov 17, 2023, 7:10 PM IST
CM KCR Public Meeting at Parakala :తాము పదేళ్లు పడిన కష్టానికి ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిచిందని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు వేరే వాళ్లు వస్తే.. తాము పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే 80 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. నీటి తీరువా రద్దు చేసి.. బకాయిలు కూడా మాఫీ చేశామని గుర్తు చేశారు. అప్పటివరకు ఎవరికీ తెలియని రైతుబంధు పథకాన్ని తెచ్చామని వివరించారు. ఇవాళ రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు.
BRS Public Meeting at Parakala :రైతుబంధు ఇచ్చి ప్రజల సొమ్ము వృథా చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటోందని.. ధరణిని తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని రైతులను ప్రశ్నించారు. ఈ పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందని తెలిపారు.