గద్వాల ప్రాంతాన్ని గబ్బు పట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా : కేసీఆర్ - గద్వాలలో సీఎం కేసీఆర్ ప్రచారం
Published : Nov 6, 2023, 5:17 PM IST
CM KCR Gadwal Meeting Speech : జోగులాంబ గద్వాల జిల్లాకు ఘన చరిత్ర ఉందని.. గద్వాలను గబ్బు పట్టించిన వారెవరో ప్రజలు గమనించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వాల్మీకులు.. తెలంగాణలో బీసీలు, ఏపీలో ఎస్టీలుగా చేర్చిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి అని తెలిపారు. గద్వాల ప్రాంతంలో వాల్మీకి, బోయ సోదరులు ఉంటారన్న ఆయన.. ఆంధ్రాలో వారు ఎస్టీలు, ఇక్కడ బీసీలని తెలిపారు. గద్వాలలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మన రాష్ట్రంలోనూ వాల్మీకి, బోయలను ఎస్టీల్లో కలిపేందుకు ప్రయత్నించామని కేసీఆర్ తెలిపారు. కేంద్రానికి తీర్మానం చేసి పంపినా ఫలితం లేదన్నారు. నీలం సంజీవరెడ్డి వాల్మీకి, బోయలకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఆంధ్రాలో న్యాయమే జరిగినా.. తెలంగాణలో మాత్రం వారిని బీసీల్లో పెట్టి అన్యాయం చేశారన్నారు. ఆనాడు వాల్మీకి, బోయలను ముంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రే అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆర్డీఎస్ కాలువను ఆగం పట్టించిన పార్టీ కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు కేసీఆర్ పిలుపునిచ్చారు.