CM KCR fires on Congress : 'పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకుంది కాంగ్రెస్ నేతలే' - కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర ఆరోపణలు
CM KCR fires on Congress over Palamuru Rangareddy : రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ సర్కారే అధికారంలోకి వస్తుందని.. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. దశాబ్ది వేడుకలలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకు నీళ్లు అందించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టు పనులు 25 శాతం పూర్తయ్యాయన్న సీఎం... మరో మూడు నాలుగు నెలల్లో కాలువల తవ్వకాలు మొదలవుతాయని తెలిపారు.
పాలమూరు రంగారెడ్డి పనులు అడ్డుకున్న కాంగ్రెస్ నేతలే.. పనులు చేయలేదంటూ విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా ప్రజలకు మంచి జరిగే విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు తన హయాంలోనే పూర్తవుతుందన్నారు. కృష్టానది జలాలతోనే పంచాయతీ ఉందని, గోదావరి జలాలతో ఎలాంటి పంచాయతీ లేదని సీఎం అన్నారు. అవసరమైన పక్షంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి గోదావరి జలాలను తీసుకొచ్చి లిప్ట్ ద్వారా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు నీళ్లు అందివ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.