KCR Tribute to Saichand : 'సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటాం..' - సాయిచంద్‌కు నివాళులర్పించిన కేసీఆర్
KCR at Saichand Dasadinakarma : ఇటీవల గుండెపోటుతో మరణించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ దశదినకర్మ.. హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, అనంతరం సాయిచంద్ సతీమణి రజినితో పాటు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. సీఎంతో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రసమయి బాలకిషన్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, సాయిచంద్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున కళాకారులు హాజరై పాటలు పాడుతూ సాయిచంద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు సాయిచంద్ కుటుంబానికి భారత్ రాష్ట్ర సమితి ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.1.50 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. బీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నెల జీతం వారికి సాయంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సాయిచంద్ భార్య వేద రజనిని నియమిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.