త్వరలోనే ఇబ్రహీంపట్నానికి ఫాక్స్‌కాన్ కంపెనీ : కేసీఆర్ - కేసీఆర్ పాలనపై వ్యాఖ్యలు
Published : Nov 14, 2023, 6:58 PM IST
CM KCR at Praja ashirvada Sabha At Ibrahimpatnam : ప్రజాస్వామ్యంలో ఉన్న ఏకైక ఆయుధం ఓటని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన ప్రజా అశీర్వాద సభలో కేసీఆర్ ప్రసగించారు. రాష్ట్రంలో మన తలరాతలను మార్చేది ఓటు దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించాలని తెలిపారు. ఓటు వేసే ముందు ప్రభుత్వం ఎవరి చేతులే పెడితే రాష్ట్రం బాగుపడుతుందో ఆలోచన చేసి ముందడుగు వేయాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని.. అందుకే తెలంగాణ ఏర్పడ్డాక ముందు రైతుల గురించి ఆలోచన చేశామని తెలిపారు. రాష్ట్రంలో పదేళ్లుగా పేదల సంక్షేమ పాలన అందించామని పేర్కొన్నారు. విధివంచితులను ఆదుకోవడం ప్రభుత్వ సామాజిక బాధ్యతని అన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ల వాడలకు వెళ్లి పది మందితో తెలంగాణలో ఎవరు వస్తే బాగుంటుందని చర్చించాకే ఓ నిర్ణయానికి రావాలని సూచించారు.
'ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కంటి వెలుగు చేపట్టాం. 3 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేశాం. 80 లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చాం. నిరుపేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మీ, బాలింతలకు కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఆడపిల్లలు పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేల సహాయం చేస్తున్నాం.' - అని కేసీఆర్ అన్నారు. సభకు వెళ్లే తరుణంలో కేసీఆర్ మెట్లపై తుళ్లిపడబోయారు.. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది కేసీఆర్‌ను పట్టుకున్నారు.