Bhatti people's March Today : 'అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్' - కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర
Bhatti people's March Today : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్వం దోపిడీమయం అయ్యిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముగ్ధుంపల్లికి చేరుకున్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నేటికి 50వ రోజుకు తన పాదయాత్ర చేరుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధిరాంలోకి వస్తే ఏం చేస్తారో ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు.
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ సరిగా కాలేదన్న భట్టి.. కాంగ్రెస్‌కు చేనేతకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. తమ పార్టీ జెండాలో చరకా గుర్తు ఉన్నట్లు గుర్తు చేసిన భట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేతకు ఉచిత కరెంటు ఇస్తామని, గౌడ సోదరులకు ఇన్సూరెన్స్ ప్రీమియం కడతామని హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం 50 శాతం నిధులు కేటాయిస్తామని, ఆర్థికంగా వారిని తమ సొంత కాళ్ల మీద నిలబడేలా చేస్తామన్నారు.
పాదయాత్రలో హామీల గురించి తెలియజేస్తూ:ఈ క్రమంలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు.పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని గుర్తు చేసిన ఆయన.. ప్రతీ పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలతో పాటు, రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామని నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల క్యాలెండర్‌ను ముందే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియంలో ఉచిత నిర్భంద విద్యను అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు.