బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ - ఎద్దు బండలాగుడు పోటీలను నిషేధించిన పోలీసులు - జోగులాంబ గద్వాలలో ఘర్షణ
Published : Dec 28, 2023, 10:38 PM IST
Congress and BRS Clash at Gadwal : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ఎద్దుల బండలాగుడు పోటీలలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించకూడదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మల్దకల్ మండల కేంద్రంలో 144 సెక్షన్ విధించారు.
Leaders Clashes at Gadwal : జడ్పీఛైర్పర్సన్, కాంగ్రెస్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత పోటీలు నిర్వహించాల్సిందే అంటూ పట్టుబట్టడంతో మల్దకల్ కేంద్రంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. జాతరకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు, రైతులు పోటీలు నిర్వహిస్తుండగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కొద్ది గంటల సేపు గద్వాల, అయిజ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో ఎద్దుల బండలాగుడు పోటీలను హైకోర్టు నిషేధించిందని, ఎవరైనా పోటీలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా అడిషనల్ ఎస్పీ రవి హెచ్చరించారు.