నాగార్జున సాగర్ డ్యాం వద్ద మళ్లీ టెన్షన్ - భారీగా పోలీసుల మోహరింపు - Nagarjuna Sagar Dam News
Published : Nov 30, 2023, 9:44 PM IST
|Updated : Nov 30, 2023, 10:55 PM IST
Clashes Between AP and Telangana Police : పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ డ్యాం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ పోలీసులు 13వ గేటు వరకు ఉన్న డ్యాంను స్వాధీనంలోకి తీసుకోవడంతో తెలంగాణ పోలీసులు సాగర్ డ్యాం వద్దకు చేరుకుంటున్నారు. 13వ గేటు వద్ద బారికేడ్లు, కంచె ఏర్పాటు చేసి.. ఏపీ పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. ఉదయం తెలంగాణ అధికారుల అనుమతులు లేకుండా నీటిని విడుదల చేయడంతో ఈ ఘర్షణ మొదలైంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డ్యాంకు ఇరువైపులా ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది.
బుధవారం అర్ధరాత్రి దాటాక ఏపీ పోలీసులు.. సాగర్ వద్దకు చేరుకున్నారు. కాపలాగా ఉన్న.. ఎస్పీఎఫ్ సిబ్బందిని గేట్లు తీయాలని కోరారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులూ అక్కడికి వచ్చారు. గేట్లు తీయాలని.. ఏపీ పోలీసులు కోరగా, ఎందుకు వచ్చారో చెప్పాలని.. తెలంగాణ పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ దశలో.. కొందరు ఏపీ పోలీసులు గేట్లు దూకారు. సీసీ కెమెరాను లాఠీతో ధ్వంసం చేశారు. ఏపీ పోలీసులు ప్రాజెక్టు 13వ క్రస్ట్ గేటు దగ్గరకు వెళ్లారు. ఇది తమ భూభాగమంటూ.. ముళ్ల కంచె వేశారు. మొత్తం 26 గేట్లుండగా, అందులో 13 గేట్లు తమవంటూ ఏపీ పోలీసులు అక్కడే కూర్చున్నారు.