భగ్గుమన్న వర్గ విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు - వరంగల్ అర్బన్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
Clash Between Warangal Congress Leaders : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. కానీ క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య మాత్రం ఐక్యత కొరవడింది. కొందరు నేతల వల్ల పార్టీ మొత్తం అప్రతిష్ట పాలవుతోంది. ఈ వర్గ పోరుల వల్ల క్యాడర్ అయోమయానికి గురవుతోంది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో హస్తం నేతల తీరు చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఘర్షణ శ్రేణుల్లో ఉత్కంఠను రేపింది. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య కొన్ని నెలలుగా అంతర్గతంగా వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. నాయిని, జంగాలు పోటా పోటీగా ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ సంఘటన మరవకముందే తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు చేపట్టిన వేళ.. రసాభాసా చోటుచేసుకంది. ఫ్లెక్సీలో కొండా దంపతుల ఫొటో లేదని అభిమానులు ఆగ్రహించారు. సమావేశంలో ఎర్రబెల్లి, కొండా వర్గాలు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు. ఘటనలో ఇరువర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి.