నల్గొండలో ఉద్రిక్తత, బీఆర్ఎస్ శ్రేణుల దాడిలో కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ భర్తకు గాయాలు - నల్గొండలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాగ్వాదం
Published : Nov 12, 2023, 4:02 PM IST
Clash Between BRS, Congress Members at Nalgonda :నల్గొండ జిల్లా కేంద్రంలోని 17వ వార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. కొందరు వ్యక్తులు మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ అశ్విని ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఘటనలో కౌన్సిలర్ భర్త అయిన భాస్కర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇది కచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తల పనేనని అశ్విని, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ దాడి విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన కౌన్సిలర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల అశ్విని గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరడం వల్లనే ఈ దాడులు జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న నల్గొండలో ఎన్నికల వేళ జరుగుతున్న ఈ ఘటనలు పట్టణ ప్రజలను భయందోళనలకు గురుచేస్తున్నాయి.