CISF శునకాలు రిటైర్మెంట్.. ఘనంగా వీడ్కోలు కార్యక్రమం.. గులాబీ రెక్కలు చల్లుతూ.. - సీఐఎస్ఎఫ్ డాగ్స్ వీడ్కోలు కార్యక్రమం
CISF Dog Retirement : దిల్లీలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో.. ఎనిమిదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న మూడు జాగిలాల పదవీ విరమణ కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇంతకాలం సేవలందించిన శునకాలకు పతకాలను అందించి, జ్ఞాపికలను బహూకరించి ఘనంగా వీడ్కోలు పలికారు.
దిల్లీ మెట్రో పరిధిలోని రైల్వే స్టేషన్‌లలో రాకీ, రోమియో, సోనీ అనే జాగిలాలు.. కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాయి. దిల్లీలోని కీలకమైన మెట్రో రైల్వే స్టేషన్‌లలో పేలుడు పదార్థాలను గుర్తించే విభాగంలో పని చేసిన ఈ మూడు జాగిలాలు.. సమర్థవంతంగా సేవలందించాయని సీఐఎస్ఎఫ్ అధికారులు కొనియాడారు. మూడు జాగిలాలకు పదవీ విరమణ కోసం ఏర్పాట్లు చేయగా.. అనారోగ్యం కారణంగా సోనీ అనే జాగిలం ఈ వేడుకకు హాజరుకాలేదు.
సోనీ తరపున ట్రైనర్ ఆ అవార్డును స్వీకరించారు. ఈ జాగిలాలు రోజుకు సగటున 800 వరకు లగేజీలను తనిఖీ చేస్తాయని సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. మూడు శునకాలకు సత్కారం చేసిన తర్వాత.. వాటిపై గులాబీ రేకులు చల్లుతూ వీడ్కోలు పలికారు. అనంతరం అందంగా అలంకరించిన జీపులో ఆ శునకాలను ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడిచే ప్రదేశానికి తరలించారు. ఈ మూడు జాగిలాలు.. దత్తత తీసుకునేందుకు అందుబాటులో ఉంటాయని సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జితేంద్ర రాణా వెల్లడించారు.