అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు- సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిసిన మజ్లిస్ నేతలు - అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో గొడవ
Published : Nov 22, 2023, 7:53 PM IST
|Updated : Nov 22, 2023, 8:07 PM IST
CI Case on MLA Akbaruddin Owaisi : ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్లు కింద కేసు నమోదు అయింది. సీఐ శివచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెయిన్‌బాగ్‌లో ఎంఐఎం(MIM) బహిరంగసభ ఏర్పాటు చేసింది. సభ బందోబస్తు పర్యవేక్షించేందుకు సీఐ శివచంద్ర వెళ్లారు. రాత్రి 10 గంటలు కావస్తుండటంతో సభ నిలిపివేయాలని చెప్పేందుకు సీఐ స్టేజీపైకి వెళ్లారు. సభకు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అనుమతి ఉండటంతో.. ఆ విషయాన్ని అక్బరుద్దీన్‌కు చెప్పేందుకు సీఐ శివచంద్ర(CI Shiva Chandra) ప్రయత్నించారు. అక్బరుద్దీన్ తనను చూసిన వెంటనే స్టేజీ దిగి వెళ్లాలని.. తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు రెండు మతాల మధ్య రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని సీఐ శివచంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అక్బరుద్దీన్( Akbaruddin)పై కేసు నమోదైంది.
Hyderabad cp React on Akbaruddin Owaisi Case : ఈ ఘటనపై హైదారాబాద్ సీపీ శాండిల్యా(CP Sandilya) స్పందించారు. గత రాత్రి జరిగిన ఎంఐఎం సమావేశంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ విజ్ఞత లేకుండా మాట్లాడారని అన్నారు. ప్రతి రోజు పోలీసులు ప్రజల కోసమే విధులు నిర్వర్తిస్తున్నారని.. మర్యాదగా చెప్తే మాకు గౌరవంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు అవడంతో మజ్లిస్ నేతలు సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిశారు. పోలీసులు అక్బరుద్దీన్ ప్రచారానికి ఆటంకం కల్గించారని.. సమయానికి ముందే సమావేశాన్ని ముగించాలని చెప్పారని ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించని పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.